V6 News

అగ్గువకే ఆపిల్ ఫోన్లంటూ టోకరా.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

అగ్గువకే ఆపిల్ ఫోన్లంటూ టోకరా.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

గండిపేట, వెలుగు: తక్కువ ధరకే ఆపిల్ ఫోన్లు, వాచీలు ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శంషాబాద్ ఆర్జీఐ విమానాశ్రయ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హయత్​నగర్‌కు చెందిన హరినాథ్ అనే వ్యక్తి ఈ నెల 26న కిషన్‌గూడ బ్రిడ్జి వద్ద ఉండగా, స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ వద్ద తక్కువ ధరకే ఆపిల్ ప్రోడక్ట్స్ ఉన్నాయని నమ్మబలికారు.

వారి మాటలు నమ్మి హరినాథ్ మొత్తం రూ. 51 వేలు ఆన్​లైన్ ద్వారా చెల్లించాడు. తీరా వస్తువులను పరిశీలించగా, అవి నకిలీవని తేలడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముఠాలోని ఆరుగురు నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. విచారణలో వారు ఆర్జీఐ ఎయిర్​పోర్ట్, పహాడీ షరీఫ్, మొఘల్‌పురా పరిధుల్లో మరో ఆరు నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి 2 నకిలీ ఆపిల్ ఫోన్లు, 14 డూప్లికేట్ ఇయర్​పాడ్స్, 14 వాచీలు, 2 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు.